విశాఖ నగరంలో మరోసారి మత్స్యకారుల మధ్య రింగు వివాదం చోటు చేసుకుంది. పెద్ద జాలరిపేట, రేసవానిపాలెం, ఎండాడ, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే నిరసనకారులు రెండు పడవలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘర్షణా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు.. మత్స్యకారుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మత్స్యకారుల మధ్య ఘర్షణతో అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రంలోకి వెళ్లిన బోట్లను బయటకు తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఓ వర్గం మత్స్యకారులు రింగు వలలతో వేటకు వెళ్లడంతో.. మరో వర్గం మత్స్యకారులు వారిని అడ్డుకున్నారు. దీంతో వివాదానికి దారి తీసింది. వాసవానిపాలెం సముద్రం తీరం దగ్గర ఉద్రిక పరిస్థితి నెలకొంది. ఓ వర్గం మత్స్యకారులు తమ పిల్లలను అపహరించుకుపోయారని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. తమ చేపల వలలు కత్తిరించారని, తమ వాళ్లను పట్టుకుని దారుణంగా కొట్టారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రింగు విషయమై ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.