కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై సీఎం సమీక్ష
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
By - Medi Samrat |
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని ఏపీలో ఏర్పాటు చేసుకునే అంశంపై ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గత పాలకులు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు పెట్టకుండా పథకాలను నిర్వీర్యం చేశారని.. యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలో సమస్యలు తలెత్తాయన్నారు. ప్రభుత్వ శాఖలు అన్నీ వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయగలిగితే అదనపు నిధుల్ని కూడా డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్‌లోగా గరిష్ట కేటాయింపులు చేసుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన చాలెంజ్ విధానంలోనూ మరికొన్ని నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేసుకోవాలన్నారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ ను శ్రీకాకుళం- విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి వ్యాల్యూ చైన్ పరిశ్రమల్ని ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులోనూ తీరప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువున కృష్ణపట్నం వరకూ ప్రతిపాదన చేయాలన్నారు. కంటైనర్ మాన్యుఫాక్చరింగ్, ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మెగాటెక్స్ టైల్ పార్కును పలనాడు ప్రాంతంలోనూ, స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ హబ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0 లో భాగంగా సెమీ కండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వీటితో పాటు రాజధాని ప్రాంతంలోని హెల్త్ సిటీలో బయోడిజైన్, మెడ్ టెక్ పార్క్, బయో ఫార్మా శక్తి మిషన్ లాంటి ఎకోసిస్టం వస్తుందన్నారు. మెడికల్ టూరిజం- హీల్ ఇన్ ఏపీ అన్న విధానంలో అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హిందుపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని మరిన్ని ఇ-బస్సులను సాధించేలా ప్రణాళిక చేయాలన్నారు. కొబ్బరి, కోకో, కాజు, కాఫీ పంటలకు ఎక్కువ నిధులను సాధించుకునే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు.