చంద్రబాబుకు వాలంటీర్‌గా ప్యాకేజీ స్టార్: సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
By అంజి Published on 21 July 2023 12:30 PM IST
చంద్రబాబుకు వాలంటీర్‌గా ప్యాకేజీ స్టార్: సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా ప్యాకేజీ స్టార్ పని చేస్తున్నాడని సీఎం జగన్ ఆరోపించాడు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంతా గజదొంగల ముఠా అన్నారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్‌కు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి ఏం తెలుసన్నారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్లను అవమానించరని అన్నారు. వాలంటీర్లు ఎవరూ కొత్తవారు కాదని.. మీ(ప్రజలు) అందరికీ తెలిసిన వాళ్లేనని అన్నారు. ఎండా, వానా లెక్క చేయకుండా ప్రజలకు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావుదన్నారు. నిర్మాత చంద్రబాబు.. నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడివేనన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. గత పాలనాకాలంలో నేతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి చంద్రబాబు నెరవేర్చలేదని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ తర్వాత వాటిని గాలికి వొదిలేశారని అన్నారు. తమ ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతిగడపకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.193.64 కోట్లు జమ చేశామని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.969.77 కోట్ల నిధులు జమచేశామన్నారు.