మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా.. ఆ సమావేశంలో ప్రస్తావించాలంటూ..
CM YS Jagan review on sadaran council meeting. నవంబర్ 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Nov 2021 12:48 PM GMTనవంబర్ 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, అండమాన్ నికోబార్ లెప్టినెంట్ గవర్నర్‌లు ఈ సమావేశానిక హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావనకు వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంతో మేలు జరిగే ఛాన్స్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను సదరన్ సమావేశంలో ప్రస్తావించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి రావాల్సిన బకాయిలు, ఏపీ రెవెన్యూ లోటుపై చర్చించాలని సీఎం జగన్ అన్నారు. రేషన్ బియ్యం కేటాయింపుల్లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన సివిల్ సప్లై బకాయిలపై సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. కృష్ణ రివర్ బోర్డు పరిధిలోకి జురాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని ప్రస్తావించాని సీఎం జగన్ అన్నారు. నదుల అనుసంధానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనల మీద సమావేశంలో చర్చించారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించి విషయాలు ఉండే అవకాశం ఉంది. అయితే వీటిపై తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.