కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం అసెంబ్లీలో గడపాలి
జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ శాసనసభలో పెట్టిన తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
By - Medi Samrat |
జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ శాసనసభలో పెట్టిన తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను క్షేత్రస్థాయి వరకూ విస్తృత ప్రచారం చేసేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ తరహా సంస్కరణలను తీసుకువచ్చిన ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేస్తోందన్నారు. ఈ సంస్కరణ ఓ ముందడుగు.. దీని ద్వారా ప్రజలకు ప్రయోజనాలు కల్పించటంతో పాటు వ్యాపారులకూ ఉపశమనం కలిగిస్తుంది. పెట్టుబడులు ఆకర్షించటం ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించేలా ఉందన్నారు.
చరిత్రలో జరిగే మంచి అంశాల్ని కొన్ని రాజకీయ పార్టీలు అర్ధం చేసుకోలేవు, సహకరించవు కూడా.. ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీది అదే పరిస్థితి. ఈ సంస్కరణల్ని స్వాగతించలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల పక్షాన పనిచేయాలి.. ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.
ప్రజా సమస్యల్ని గుర్తించి భవిష్యత్తులో ప్రజలు ఎలా ఉండాలన్న దానిపై పాలసీలు రూపొందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదన్నారు. ఈ తరహా సంస్కరణల్ని కనీసం స్వాగతించాలి. లేదా ఆర్ధం చేసుకోవడానికైనా ప్రయత్నించాలి.. ఈ రెండూ కొందరు చేయలేకపోవటం బాధాకరం అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం అసెంబ్లీలో గడపాలి.. మంత్రులు, అధికారులు బాధ్యతగా శాసనసభలో ఉండాలని సూచించారు. అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేల కోసం మాత్రమే కాదు.. 5 కోట్ల మంది ప్రజల కోసం.. వారి భవిష్యత్ కోసం అసెంబ్లీ ఏర్పాటైంది. అసెంబ్లీ అనే దేవాలయంలో ప్రజాహితం కోసం చేసే నిర్ణయాలు జరుగుతాయి.. ప్రజల జీవితాల్లో మార్పుల కోసం మనం అంతా కూర్చుని చర్చించాలి.. దేశాన్ని, భవిష్యత్ తరాన్ని ముందుకు నడిపించగలిగిన సంస్కరణ ఇది అని ముగించారు.