గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే..! దీంతో వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని.. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని సూచించారు.
మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.