ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ

CM Jagan Meet With PM Modi. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

By Medi Samrat  Published on  28 Dec 2022 11:53 AM GMT
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి వివరించారు సీఎం జ‌గ‌న్‌. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం జ‌గ‌న్‌. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, కొంత పురోగతి సాధించినప్పటికీ, కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు సీఎం.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని పీఎం దృష్టికి తీసుకెళ్లారు సీఎం. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు సీఎం. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోందని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు సీఎం జ‌గ‌న్‌.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు సీఎం జ‌గ‌న్‌. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని.. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేశారు సీఎం. డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు సీఎం. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారని గుర్తుచేశారు సీఎం జ‌గ‌న్‌.

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్‌కోకు ఈ బకాయిలు చాలా అవసరమని తెలిపారు సీఎం జ‌గ‌న్‌. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించారు సీఎం జ‌గ‌న్‌.

రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పీఎంను కోరారు సీఎం జ‌గ‌న్‌. రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు సీఎం. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపిన సీఎం. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని పీఎంను కోరారు సీఎం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు సీఎం జ‌గ‌న్‌.

కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు సీఎం జ‌గ‌న్‌. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్ర‌ధానిని కోరారు సీఎం జ‌గ‌న్‌.


Next Story