పాలకొల్లు, తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు, తిరుమలలో పర్యటించనున్నారు.
By - Medi Samrat |
ఇవాళ, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు, తిరుమలలో పర్యటించనున్నారు. బుధవారం (ఇవాళ) మధ్యాహ్నం 12:45 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 01:30 గంటలకు పాలకొల్లు బ్రాడీపేటకు చేరుకోనున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను చంద్రబాబు ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 02:30 గంటలకు పాలకొల్లు నుంచి బయలుదేరి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 03:30 గంటలకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తొలిసారి ఏపీకి రానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళి...అక్కడి నుంచి సాయంత్రం 06:20 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 07:55 గంటల నుంచి 09:15 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరుమలలో బస చేయనున్నారు. గురువారం ఉదయం 09:10 గంటలకు వెంకటాద్రి నిలయం చేరుకుంటారు. టీటీడీ ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ట్విన్ కమాండ్ సెంటర్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అమరావతికి తిరుగుప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 12:25 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. 03 గంటలకు రాష్ట్ర సచివాలయం సమీపంలో నిర్వహించే డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.