రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

By Medi Samrat
Published on : 24 March 2025 4:03 PM IST

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి కనిపించకూడదు

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని....అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్ధిష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

పసుగ్రాసం కొరత లేకుండా చర్యలు

ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి...వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. మార్కెట్లు, బస్‌స్టాండ్లు, కూలీ అడ్డాలు, ఇతర జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ శాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరుఫున మజ్జిగ అందించామని....ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగునీరూ లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది గుర్తెరిగి అధికారులు తమ ఆలోచనలను అమలు చేయాలని సీఎం అన్నారు. వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు.

పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు

పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని, తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో పర్యవేక్షించాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా కార్చిచ్చుకు కారణం అయినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరిగే అస్కారం ఉండేపరిశ్రమల్లో మరితం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీటి లభ్యత పెంచేందుకు గ్రామాల్లో నరేగా ద్వారా ఫాం పాండ్స్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా వేసవిలో నరేగా కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు...వారికి పని ప్రాంతంలో నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరుకునేలా చూడాలన్నారు. ప్రజలు, ఉపాధి కూలీలు, ప్రయాణికులు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించకుండా చూడాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, వడదెబ్బకు ట్రీట్మెంట్ అందించే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టాలని...తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు వ్యాధుల భారినపడకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story