ఏఐ సిటీగా రాజ‌ధాని అమరావతి ఉండాలి.. అధికారుల‌కు సీఎం చంద్రబాబు కీల‌క ఆదేశాలు

అమ‌రావ‌తి రాజ‌ధాని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాల‌ని.. ఆ దిశగా ప్ర‌ణాళిక‌లు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

By Medi Samrat  Published on  29 Aug 2024 3:57 PM IST
ఏఐ సిటీగా రాజ‌ధాని అమరావతి ఉండాలి.. అధికారుల‌కు సీఎం చంద్రబాబు కీల‌క ఆదేశాలు

అమ‌రావ‌తి రాజ‌ధాని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాల‌ని.. ఆ దిశగా ప్ర‌ణాళిక‌లు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ స్పుర‌ణ‌కు వ‌చ్చేలా అమ‌రావ‌తి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజ‌ధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌల‌భ్య‌త ఉట్టిప‌డేలా రాజ‌ధాని నిర్మాణం ఉండాల‌న్నారు.

అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని అని, అలాంటి గొప్ప రాజ‌ధాని ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజ‌ధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌ధాని ప‌నులు వేగంగా పున‌రుద్ధరించాల్సి ఉంద‌న్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం, ప‌నులు చేప‌ట్ట‌డానికి టెండ‌ర్లు పిల‌వ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో ఆయ‌న స‌మీక్షించారు.

జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో ఏమాత్రం చేప‌ట్టామో అంత‌కుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు క‌ద‌ల్లేద‌ని, గ‌త ప్ర‌భుత్వం ఈ నిర్మాణాల‌ను పూర్తీగా వ‌దిలేసింద‌ని అధికారులు సీఎంకు సూచించారు. ఇప్పుడు ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి చేయ‌నున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ భ‌వ‌న నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాల‌యాన్ని అందుబాటులోకి తేవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణాల‌కు కూడా అత్యాధుని టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి, నాణ్య‌తలో ఎక్క‌డా కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు.

Next Story