రైతుకు ధర దక్కాలి.. వినియోగదారునికి ధర తగ్గాలి
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By - Medi Samrat |
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”రైతులకు లాభం రావాలి... వినియోగదారునికి ప్రయోజనం కలగాలి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. పత్తికొండలో ఇటీవల కాలంలో టమాటో పంటకు ధర తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను రైతు బజార్లకు తరలించి.. వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కోల్డ్ చైన్ లాంటి వ్యవస్థలను ఉపయోగించుకుని టమాటో పంటలకు ధర తగ్గకుండా చూసుకోవాలి. రైతు బజార్లను ఆధునీకరించాలి. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్ల ఆధునికీకరణకు భూమి ఎంత వరకు అవసరమవుతుందో అంచనా వేయాలి. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. మార్కెట్ కమిటీలను, రైతు బజార్లను అనుసంధానం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా నిధుల సమీకరణ చేపట్టి... వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి.” అని సీఎం ఆదేశించారు.
ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన
“రైతు సేవా కేంద్రాలను పునర్ వ్యవస్థీకరించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతుసేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి. రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో రైతుసేవా కేంద్రాలే కీలక పాత్ర పోషించాలి. ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ పంట వస్తుందని.. ఆదాయం వస్తుందని రసాయన ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడేస్తున్నారు. తద్వారా భూసారం క్షీణించడంతో పాటు వ్యాధులు వస్తున్నాయి. రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించిన ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలి... దాని ద్వారా ఉత్పాదకత పెంచాలి. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు పెంచేలా, ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలి. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ఎలాంటి మార్పులు జరగాలన్నా... క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలి. భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలి. దశలవారీగా రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి.” అని సీఎం అన్నారు.
రబీ సీజన్‌కు పక్కా ప్రణాళిక
“రబీ సీజన్ కోసం 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని సమీక్షలో అధికారులు వివరించారు. ఇప్పటికే జిల్లాలకు 41 వేల మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాలకు సరఫరా చేశామని అధికారులు చెప్పారు. పోర్టుల్లో 79,527 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ..“రబీ సాగు కోసం భూసార పరీక్షలు చేసి... ఆ డేటా ప్రకారం మైక్రో న్యూట్రియంట్స్ వేసుకునేలా రైతును ప్రోత్సహించండి. వచ్చే సీజన్‌కు భూసార పరీక్షలపై ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందించండి. దుకాణాల వారీగా, రైతుసేవా కేంద్రాల వారీగా రికార్డులు నవీకరణ చేయాలి. భూసార పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఎకరాకు ఎంత ఎరువు వినియోగించాలో రైతులకు దిశా నిర్దేశం చేయాలి. యూరియా ఎవరు తీసుకున్నారనే విషయాన్ని పూర్తి స్థాయిలో రికార్డులు నిర్వహించాలి. రైతులు, కౌలు రైతులకు ఎంత యూరియా సరఫరా చేశారన్న అంశంపై రికార్డులు పక్కాగా ఉండాలి. సాగు విస్తీర్ణం ప్రకారం ఎరువుల సరఫరా జరగాలి. యూరియాను డైవర్ట్ చేసిన ఉదంతాలు ఇటీవల కాలంలో చూశాం. ఆధార్ ఆథంటికేషన్ చేసి ఎరువుల సరఫరా జరగాలి. ఈ ఏడాది 90.91 లక్షల మెట్రిక్ టన్నుల మేర పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం. టార్ఫాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలి.” అని చంద్రబాబు చెప్పారు.
ధన-ధాన్య కృషీ యోజన కింద రైతులకు కలిగే లాభాలపై అధ్యయనం
“హెడ్డీ బర్లీ పొగాకును రైతులు తక్కువ ధరకే అమ్ముకోకుండా చూడాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకుకు రైతులకు రూ.96 కోట్లు చెల్లింపు చేశాం. హెచ్డీ బర్లీ పొగాకు పంటకు మార్కెట్ ఉండేలా చూడాలి. దీని కోసం పంటను కూడా అవసరమైన మేరకు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు జిల్లాల్లో పొగాకుకు క్రాప్ హాలిడే ప్రకటించండి. త్వరలో ప్రధాని ప్రారంభించబోయే ధన-ధాన్య కృషీ యోజన కింద ఏ పంటకు ఎక్కువ లాభం వస్తుందో చూసుకుని ఆ పంటలను ప్రొత్సహించాలి. పప్పు దినుసుల విషయంలో వందశాతం కొనుగోళ్లు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.. రైతులకు ఎంత వరకు లబ్ది చేకూరుతుందో చూడండి. గతంలో ఏపీ కంటే కర్ణాటకలో సెరీకల్చర్ సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం... ఏపీ కంటే 8 రెట్లు అధికంగా సెరీకల్చర్ రంగంలో ఉత్పత్తి చేస్తోంది. ఎందుకు ఈ స్థాయిలో గ్యాప్ వచ్చిందో విశ్లేషించండి. సిల్క్ ఉత్పత్తికి సంబంధించి యంత్రాలను ఎంఎస్ఎంఈలో పెట్టి.. వాటిని సబ్సిడీ మీద సరఫరా చేసేలా చూడండి. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో అగ్రిటెక్ పై కూడా పని చేస్తున్నాం. సెరీ కల్చర్ విషయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకోండి. పట్టు పురుగుల సాగు ఉండే చోట ఇతర పంటల సాగులో ఎరువుల వినియోగం తక్కువగా ఉండేలా చూడండి. వ్యవసాయ -సెరీకల్చర్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ప్రతీ పంటపైనా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేయాలి. రైతులకు వచ్చే పంట ఆదాయం, ఇతర ప్రత్యామ్నాయాలపై రీ-ఓరియంటేషన్ జరగాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రొత్సాహం
“ఉల్లి, టొమాటో, మిర్చి, మామిడి పంటల విషయంలో సాగు ఖర్చులు ఎంత వరకు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. ఆయా పంటలకు ధరలు తగ్గకుండా ప్రణాళికలు చేసుకోవాలి. టేబుల్ వెరైటీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపితే అసలు ధరలు పడిపోయి నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. స్థానిక అవసరాలు, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎంతమేర పంపించాలన్న దానిపై ముందస్తు ప్రణాళికలు ఉండాలి. అరటి పంటకు దేశీయంగానూ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున వినియోగం ఉంది. ఉద్యాన పంటలను దేశీయ మార్కెట్టుతో పాటు ఎగుమతులు చేసేందుకు, లాజిస్టిక్స్ సవాళ్లు లేకుండా చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో అనుబంధ ఉత్పత్తులుగా వచ్చే పుట్టగొడుగుల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. సర్క్యులర్ ఎకానమీలోకి పుట్ట గొడుగుల సాగును తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న ఆవుల విసర్జితాలతో జీవామృతం తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి. ఆవు పేడను దుబాయ్ దేశంలో ఖర్జూరపంటకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూలీల వ్యయం తగ్గేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ప్లాంటేషన్, హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ అనేదే పకృతి సేద్యంలో కీలకం. కాఫీ గింజలకు సోకిన బెరిబోరర్ తెగులు నివారణకు జీవామృతం వినియోగించాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
జీలుగ, పట్టు ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
ఈ సమీక్ష సమావేశంలో జీలుగు ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని ముఖ్యమంత్రి రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలన్నారు. గిరిజన రైతులకు ఎక్కువ ఆదాయం లభించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పోస్టర్ రిలీజ్ చేశారు. నాణ్యమైన పట్టుగూళ్లతో తయారు చేసిన ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన వస్త్రాలను, బొకేలను రాష్ట్రానికి వచ్చిన అతిథులకు అందించే దిశగా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన బోకేను మంత్రి అచ్చెన్నాయుడు అందించి.. మల్బరీ పట్టు వస్త్రాన్ని సీఎం చంద్రబాబుకు బహుకరించారు.