చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు

విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు

By Knakam Karthik
Published on : 24 May 2025 10:57 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Union Minister AmitShah, Central Government

చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు

విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తామని, రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభిస్తామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పదేళ్ల సమయం పడుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణ హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. గత పాలకులు రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏడుగురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థికసాయంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం

ఏపీ జీవనాడి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇదే అంశంపై జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో చర్చించాను. పోలవరం వేగం, నాణ్యతలో రాజీపడబోము. రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గత పాలకుల నిర్వాకం వల్ల మళ్లీ రూ.980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాము. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చు ఈ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి ఎవరూ వ్యతిరేకం కాదు. తెలంగాణలో కూడా గోదావరిపై కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అక్కడి మిగులు నీరు మనకు వస్తే ఉపయోగమవుతుంది. వందేళ్లలో 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. సముద్రంలోకి పోయే 200 టీఎంసీలను కరువు ప్రాంతానికి ఉపయోగించాలని నిర్ణయించాం. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం . కేంద్రం అనుమతి ఇవ్వగానే ప్రాజెక్టు ప్రారంభిస్తాం.

చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి

శాంతిభద్రతలపై 24 రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్రతలకు సంబంధించి హోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు. చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించాలని అమిత్ షాను కోరాము. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా మూడు రాజధానుల పేరుతో ప్రజల భవిష్యత్‌తో ఆటలాడుకుంది. ఇలాంటి సదర్భంలో స్థానిక రైతుల కోరిక మేరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ చేయమని హోంమంత్రిని కోరాను. దీంతోపాటు ఆర్డీటీ అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం.

విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

గత ఐదేళ్లలో చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగుచేసేందుకు పదేళ్ల సమయం పడుతుంది. ఎన్డీఏ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. అన్ని విభాగాల్లోనూ డ్యామేజ్ చేశారు. ఎప్పుడూ చూడని విధ్వంసం జరిగింది. ఆర్థికంగా వెసులుబాటులేని పరిస్థితి . చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించిన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ , రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. 29 వేలమంది రైతులు, 34 వేల ఎకరాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎవరెన్ని కుయుక్తులు చేసినా అమరావతిని చిన్నాభిన్నం చేయలేకపోయారు. మొన్ననే బెంగుళూరు ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 చూశాను. చాలా బాగుంది. దాన్ని మించిన ఎయిర్ పోర్టును ఏపీలో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story