నేడు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 7:46 AM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను అందజేశారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉదయం 8 గంటలకు శ్రీ వకుల మాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆంజజేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించారు. ఆయనకు ఆలయ ఈవో శ్యామలరావు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగ దేవుడు, సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం వెంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక పర్యాయాలు పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.