నాలుగోసారి కూడా మోదీనే వస్తారు.. రాష్ట్రంలో మ‌రోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు.

By -  Medi Samrat
Published on : 12 Sept 2025 4:41 PM IST

నాలుగోసారి కూడా మోదీనే వస్తారు.. రాష్ట్రంలో మ‌రోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు.. దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలి.. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధం చేశామ‌ని పేర్కొన్నారు.

20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా మారిందన్నారు. 2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుంది.. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకున్నాం... ఈ ఏడాది.. గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగాం.. 2028-29 నాటికి రూ. 29, 29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధిస్తామ‌న్నారు. 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు ర‌చించామ‌ని.. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందన్నారు.

2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ. 5,42,985 సాధిస్తాం.. 2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000 సాధించగలమ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఇవేమీ అసాధ్యం కాదు... నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశామ‌న్నారు. మెగా డ్రీమ్స్ ఉండాలి... సంకల్పం ఉండాలి... అప్పుడు సాధ్యమన్నారు.

విజన్ 2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్‌పై ఇంకా అనుమానాలు సరికాదన్నారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమాతరంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం... అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం.. రాజకీయాలు ముఖ్యమే కానీ... సమాజం గురించి కూడా ఆలోచించాలన్నారు. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావన్నారు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలన్నారు.

1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను... 1999లో గెలిచాను.. 1999లో ప్రభుత్వం వచ్చాక ఓ తపనతో పని చేశాను.. కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయాం.. కానీ ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నాం... సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు అందిస్తున్నామ‌న్నారు. నాలుగోసారి కూడా మోదీనే వస్తారు... రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది.. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

Next Story