రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు
“రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్దం చేసుకున్నాం... అన్ని రంగాల్లోనూ సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర ప్రణాళికలున్నాయి.
By Medi Samrat
“రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్దం చేసుకున్నాం... అన్ని రంగాల్లోనూ సీమను అభివృద్ధి చేసేలా మా దగ్గర ప్రణాళికలున్నాయి. దీంట్లో భాగంగానే రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కుప్పం చిట్ట చివరి భూములకు నీటిని అందించాం. రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీకి జీర్ణం కాదు. వైసీపీకి నాటకాలు ఆడడం అలవాటు... ఎన్డీఏకు నీళ్లు తేవడం అలవాటు.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహరతి ఇచ్చారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ ద్వారా కృష్ణా జాలాలు కుప్పం చివరి భూములకు చేరాయి. శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుంది. దీంతో కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తన నివాసం నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు ఆర్టీసీ బస్సులో మహిళలు, రైతులతో కలిసి చేరుకుని జలహారతి ఇచ్చారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టుకుని కృష్ణమ్మకు జలహరతి అందించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా పరమసముద్రంచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 'నన్ను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన నా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడంతో నా జన్మ ధన్యమైంది. నా సంకల్పం నెరవేరింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కృష్ణా పుష్కరాలు 2028లో వస్తుంటే కుప్పానికి మాత్రం రెండేళ్లు ముందే వచ్చాయి. కుప్పం ప్రజలు నన్ను ఇంటి బిడ్డగా ఆదరించారు. వారికి నేను ఏం చేసినా తక్కువే' అని చంద్రబాబు అన్నారు.