ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి : చంద్రబాబు

వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు పడ్డ కష్టాలన్నీ తనకు గుర్తున్నాయని.. కష్టపడి పని చేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on  26 Jun 2024 2:45 PM GMT
ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి : చంద్రబాబు

వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు పడ్డ కష్టాలన్నీ తనకు గుర్తున్నాయని.. కష్టపడి పని చేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీని బలహీన పరచాలనుకున్న నాటి ప్రభుత్వ కుట్రలు నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం ముందు పని చేయలేదన్నారు. కుప్పం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు.

గత ఐదేళ్ల పనితీరును, ఎన్నికల్లో అవలంభించిన విధానాలపై చంద్రబాబు సమీక్షించారు. 2029 ఎన్నికలకు ఏ ప్రణాళికతో పనిచేయాలో నేతలు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘8 సార్లు నేను కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచాను.. గత ఐదేళ్లలో పాలనలో జరిగినంత హింస, దాడులు, దారుణాలు ఏనాడూ చూడలేదు. నన్ను నైతికంగా దెబ్బతీయాలని చూశారు.. స్థానిక నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చూశారు. అయినా వారి ఎత్తులు సాగలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నేను జిల్లా పర్యటనకు వస్తే జీవో-1 తెచ్చి రాకుండా అడ్డుకున్నారు.. నిరసన తెలిపిన కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా 10 మందిని అరెస్టు చేసి 30 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇలా ఒకటని కాదు.. అన్ని విధాలుగా ప్రయత్నించి కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టాలని చూశారు. వాటన్నింటిని తట్టుకుని మీరు పని చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి నాటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చులేదు.

‘‘నాపై రెండు గురుతర బాధ్యతలున్నాయి. ఒకటి కుప్పంను దేశంలోనే నెంబర్ -1 నియోజకవర్గంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం.. రెండు కుప్పంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం. మీరంతా ప్రజలతో మమేకమై బాగుండాలి.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మీరు కూడా చేయొద్దు. గత ప్రభుత్వానికి.. మన ప్రభుత్వానికి మధ్య మార్పు ప్రజలకు కనిపించాలి. మనమంతా క్రమశిక్షణ, బాధ్యతతో ఉండాలి. బాగా పని చేస్తే ఏ స్థాయి నాయకుడు అయినా.. వారి ఇంటకి వెళ్లి నేనే అభినందనలు తెలుపుతా. నా చుట్టూ తిరగకుండా పార్టీపై దృష్టి పెట్టాలి. సామాన్య కార్యకర్తలను ఎంపీలు, మంత్రులుగా చేసిన చరిత్ర మన టీడీపీకి ఉంది. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే పూచి నాది.’’ అని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Next Story