అమరావతి: యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని చంద్రబాబు సూచించారు. కాగా సమావేశంలో యూరియా వినియోగంపై చర్చ జరిగింది.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిది. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ఇస్తాం. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తాం. యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. యూరియా వాడని రైతులకు బస్తాకు రూ.800 ప్రొత్సాహకం ఇస్తాం. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం. యూరియా కొరత లేదు... అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం...అని సీఎం వ్యాఖ్యానించారు.