ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By - Medi Samrat |
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో మరో 700 క్యాంటీన్లు ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌కు తప్పకుండా భారతరత్న సాధిస్తామని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. అప్పట్లో 'మదరాసి' అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తుచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్టీఆర్ రాకముందు చదువు లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్నవారికే ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6ను సూపర్ హిట్ చేసిందని, ఉగాది రోజున 5 లక్షల గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు. మరో 3 ఏళ్లలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సమర్థవంతంగా సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చినమాట ప్రకారం.. ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన పూర్వీకుల భూమికి గత పాలకుల ఫొటోలు పెట్టుకున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా.. 80 శాతం ఫిర్యాదులు భూములపైనే ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. కొంత మంది క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారని.. రూ.700 కోట్లు ఖర్చుపెట్టి సర్వే రాళ్లపై వాళ్ల ఫొటోలు వేసుకున్నారంటూ వైసీపీ అధినేత జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.