ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 3 Oct 2025 3:00 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Heavy Rains, Rain Alert, video conference

ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష

అమరావతి: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ తెలిపారు. అటు ఒడిశాలోని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు సీఎంకు వివరించారు.

ఇక భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని...ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని....ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని చెప్పారు. కాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు వెల్లడించిన ఈపీడీసీఎల్ అధికారులు సీఎంకు వివరించారు. ఇవాళ సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించిన సీఎం.. విద్యుత్ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సూచించారు.

Next Story