ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని.. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.