అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
By - Knakam Karthik |
అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు... కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు.
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్పజెప్పామని... ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంత్రులు, సెక్రటరీలతో మాట్లాడాలని అన్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన సమయాల్లో ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి.. రాష్ట్రానికి మేలు జరిగేలా పనులను, నిధులను సాధించాల్సిన బాధ్యతను ఎంపీలు తీసుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్ర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు అందరూ వర్చువల్‌గా పాల్గొనాలని స్పష్టం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్... ఈ మూడింటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలన్నారు.
అలాగే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని... దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్ లో ఉండాలని సీఎం సూచించారు. వీటితో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తావించాలని సూచించారు. సభలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ మాట్లాడాలని, సమస్యలు ఉత్పన్నమైనా పట్టు వదలకుండా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు.