త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 9:25 PM IST![Andrapradesh, CM Chandrababu, Tdp, Janasena, Bjp, Dsc, Unemployees Andrapradesh, CM Chandrababu, Tdp, Janasena, Bjp, Dsc, Unemployees](https://telugu.newsmeter.in/h-upload/2025/02/11/394531-dsc.webp)
త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా ఏర్పడిన నష్టాలు వెంటాడుతున్నా.. ఆర్థిక ఇబ్బందులు, బాధలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల పాత బకాయిలను చెల్లించగలిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పని చేయడం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
గత పాలకుల నిర్వాకం వల్ల ఇంకా చెల్లించాల్సిన పాత బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ మనం ఇంకా మన పని తీరు పెంచుకుని వాటిని అధిగమించాలన్నారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఎన్ని కష్టాలున్నా సరే.. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడుతున్నామని.. క్యాపిటల్ ఎక్స్‌పిండిచర్ కింద, నీటి పారుదల, రహదారులు తదితర పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేశామని సీఎం తెలిపారు.
త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన నిధులు ఎంత మేర రాబట్టగలుగుతామో ఆ మేర రాబట్టేలా పని చేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందని సీఎం వెల్లడించారు.