'క్లైమోర్ మైన్‌లే నన్నేమీ చేయలేకపోయాయి.. ఈ విమర్శలు నన్నేం చేయగలవు' : సీఎం చంద్ర‌బాబు

సీమకు నీళ్లివ్వడంతో వచ్చే ఆనందం, తృప్తి నా జీవితంలో మరిచిపోలేను అన్నారు సీఎం చంద్ర‌బాబు.

By Medi Samrat
Published on : 17 July 2025 3:46 PM IST

క్లైమోర్ మైన్‌లే నన్నేమీ చేయలేకపోయాయి.. ఈ విమర్శలు నన్నేం చేయగలవు : సీఎం చంద్ర‌బాబు

సీమకు నీళ్లివ్వడంతో వచ్చే ఆనందం, తృప్తి నా జీవితంలో మరిచిపోలేను అన్నారు సీఎం చంద్ర‌బాబు. హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులకు కృష్ణా జలాలు విడుదల చేసిన అనంత‌రం ఆయ‌న నందికొట్కూరులో నీటి వినియోగదారులతో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నేను ఈ ప్రాంతంలో పుట్టాను.. సీమ రైతుల కష్టాలు.. ఇక్కడి కరువు పరిస్థితులు నాకు తెలుసు.. పశువులకు గ్రాసం కూడా దొరకని దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి.. ఆ రోజుల్లో రైళ్లల్లో పశుగ్రాసం తెప్పించాం.. రాయలసీమ చరిత్ర తిరగరాయాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

రాయలసీమకు నీళ్లు రావన్నారు.. రాజకీయాలు చేశారు.. పెత్తందారులు ఉన్నారు.. రాయలసీమ బాగు కోసం టీడీపీ మినహా మిగిలిన నేతలెవ్వరూ ఆలోచన చేయలేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నాందీ పలికింది ఎన్టీఆరేన‌న్నారు. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతే చెన్నైకు నీళ్లిస్తామని కేంద్రానికి స్పష్టంగా చెప్పిన నేత ఎన్టీఆర్.. 554 కిలో మీటర్ల మేర హంద్రీ-నీవా కాల్వలను విస్తరించడం అసాధ్యం అని అందరూ అన్నారు.. కాల్వల విస్తరణ చేయకుంటే చివరి భూములకు నీరందదు.. ఆ భూములకు నీరందించేందుకు రూ.3890 కోట్లు కేటాయించి విస్తరణ పనులు చేపట్టాం.. ఇప్పుడు ఫేజ్-1కు నీళ్లిచ్చాం.. మరో 15 రోజుల్లో ఫేజ్-2 పనులు కూడా పూర్తి చేసేస్తాం.. చివరి భూములకు నీరందిస్తామ‌న్నారు.

నా సంకల్పానికి ప్రజా ప్రతినిధులు.. అధికారులు.. రైతులు.. అందరూ సహకరించారు.. గ్రేట్ జాబ్.. బిగ్ కంగ్రాచ్యులేషన్స్.. కృష్ణగిరి, అనంతపురం, జీడిపల్లి, పీఏబీఆర్ వంటి ప్రాజెక్టులకు నీరు అందుతుంది. నాకు సవాళ్లు కొత్త కాదు.. అసాధ్యమనుకున్న పనులను పూర్తి చేయడాన్ని నేను సవాలుగా తీసుకుంటానన్నారు.

పరిశ్రమను స్థాపించాలంటే నీటి సౌకర్యం కావాలని కియా వాళ్లు అడిగారు.. పెనుగొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయరును 8 నెలల్లో పూర్తి చేసి.. కియా పరిశ్రమ వచ్చేలా చేశాను.. 6 లక్షలకు ఎకరాలకు పైగా సాగు నీరు.. 33 లక్షల మందికి తాగు నీరు ఇస్తున్నాం.. రాయలసీమ ప్రజల చిరకాల కలను నేరవెర్చామ‌న్నారు.

2019లో ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క ఛాన్స్ అన్నారు.. ప్రజలూ ఏమారారు.. చంద్రబాబు బాగానే చేస్తున్నారు.. కానీ ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఐదేళ్ల పాటు.. బాదుడే బాదుడు.. నరుకుడే నరుకుడు అని వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ.. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.. రాయలసీమ అంటూ సెంటిమెంట్ వైసీపీ రెచ్చగొడుతుంది.. కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.. మాటలు చెప్పడం ఈజీ.. కానీ పని చేయడం చాలా కష్టం.. హంద్రీ-నీవాపై వైసీపీ ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టిందా..? అని ప్రశ్నించారు.

కుప్పంలో పెద్ద డ్రామా వేశారు.. కాల్వల్లో నీళ్లు లేవు.. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చారు.. డమ్మి గేట్లు పెట్టి.. నీళ్లిచ్చామన్నారు.. అలాంటి డ్రామాలు ప్రజలకు అవసరమా..? అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసింది టీడీపీ.. ప్రాజెక్టులను చెడగొట్టింది వైసీపీ అని మండిప‌డ్డారు.

శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు.. తిరుమల వెంకన్న వరకు తీసుకెళ్లవచ్చు.. దేవుళ్లను కూడా అనుసంధానం చేసి.. జలహరతి ఇద్దాం.. ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం.. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే.. రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు.

ఢిల్లీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఇబ్బందులు ఉంటాయి.. రాజకీయాలు ఉంటాయి.. కానీ వీటిని అధిగమించి సమస్యను పరిష్కరిస్తాం.. నన్ను తిట్లు తిట్టినా.. శాపనార్దాలు పెట్టినా.. నేను మనస్సుకు తీసుకోను.. వెనకడుగు వేయను అన్నారు. క్లైమోర్ మైన్‌లే నన్నేమీ చేయలేకపోయాయి.. ఈ విమర్శలు నన్నేం చేయగలవు అన్నారు. ఒక్క సారి అధికారమిస్తే.. ఐదేళ్లపాటు రోడ్లన్నీ గుంతలు కొట్టారు.. వాళ్లు చేసిన గుంతలను పూడుస్తున్నాం.. రోడ్లు వేస్తున్నాం.. అభివృద్ధి చేస్తాం.. సంక్షేమం అందిస్తాం.. చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నామ‌న్నారు.

పెన్షన్ పెంచడానికి వైసీపీకి మనస్సు రాలేదు.. ఐదేళ్లు సమయం తీసుకున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటున్నా.. పెన్షన్లను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచాం.. దివ్యాంగులకు ఆరు రెట్ల మేర పెన్షన్ పెంచాం. రూ. 33 వేల కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు.

తల్లికి వందనం చెప్పినట్టు అందరికీ ఇస్తున్నాం.. ఇదీ మా విశ్వసనీయత అన్నారు. పేదలకు తిండి పెట్టడం నేరమా..? గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసింది. కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లను తెరిపించాం.. పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నాం.. పేదలకు సంక్షేమం అందించడాన్ని గొప్పగా భావించడం లేదు.. ఓ బాధ్యతగా తీసుకున్నామ‌న్నారు.

Next Story