సైకిల్‌కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు

గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 8:20 PM IST

సైకిల్‌కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు

గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బెగ్గిలపల్లెలో ముగ్గురు లబ్దిదారుల నివాసాలకు వెళ్లిన సీఎం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్న తాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకట రామప్ప అనే లబ్ధిదారుకు వృద్ధాప్య పింఛను అందించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో తనను చూసేందుకు తరలి వచ్చిన మహిళలకు సీఎం చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. గ్రామస్థుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అంతకుముందు బెగ్గిలపల్లె మండల పరిషత్ పాఠశాల విద్యార్ధులతో సీఎం ముచ్చటించారు.

అనంతరం పేదల సేవలో ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోని ఏ రాష్ట్రమూ ఇవ్వనంత సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నామని సీఎం వివరించారు. ప్రతీ నెలా

రూ. 2730 కోట్ల మేర పెన్షన్ల రూపంలో లబ్దిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పొరుగున తమిళనాడులో నెలకు రూ. 315 కోట్లు, కర్ణాటకలో రూ. 392 కోట్లు పెన్షన్లు నిమిత్తం ఖర్చు చేస్తున్నారని సీఎం అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పేదలకు ఏ స్థాయిలో పెన్షన్ అందచేస్తున్నామనేది గుర్తించాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేశామన్నారు. దీపం-2.0 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని వివరించారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ కల్పిస్తే తాను 33 శాతం రిజర్వేషన్లను ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అమలు చేసినట్టు వివరించారు. త్వరలో చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయన్నారు. సమీప భవిష్యత్తులో మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎదుగుతారని అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే లక్ష్యాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.

Next Story