రాజమండ్రికి చేరుకున్న చిరంజీవి
Chiranjeevi reached Rajahmundry. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఏపీ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 4 July 2022 4:56 AM GMTప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ సోమవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో ప్రధాని పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భీమవరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే సభ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. వర్షం కురిసినా సభకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా రెక్సిన్ టెంట్లు వేశారు.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజీవి భీమవరం చేరుకున్నారు. ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు. భారీ గజ మాలతో వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు. భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి చిరంజీవి వేదిక పంచుకోనున్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఏపీలో పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి.. కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు.