ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన ఇప్పటి నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యువగళం పేరుతో నారా లోకేష్, వారాహి విజయ యాత్రతో పవన్ కళ్యాణ్ జనంలో తిరుగుతున్నారు. రానున్న ఎన్నికలలో ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. పవన్ వస్తే తన సీటును ఇస్తానని అన్నారు. భుజాలపై ఎక్కించుకొని పవన్ ను గెలిపిస్తానని పేర్కొన్నారు. పవన్ దెందులూరు సీటు కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు. మా నాయకుడు చంద్రబాబు తీసుకునేదే ఫైనల్ నిర్ణయం అని స్పష్టం చేశారు. సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని పేర్కొన్నారు.
బీజేపీతో పొత్తులపై అధిష్టానం ఏమైనా చెప్పిందా.. అని చింతమనేనిని మీడియా ప్రశ్నించగా.. దీనిపై పోలిట్ బ్యూరో గాని అధినేత చంద్రబాబు గాని చెప్పాల్సి ఉంటుందన్నారు. బీజేపీతో ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఎలా చెబితే అలా చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువగా సీట్లు అడిగే అవకాశం ఉందికదా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఒకవేళ పవన్ కళ్యాణ్ దెందులూరు సీటును ఆశిస్తే త్యాగం చేస్తానని.. భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానని చెప్పారు.