బాపట్ల జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే ప్రాణాలు కోల్పోయాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన చిన్నారిని గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు.
ఆదివారం రోజు పిల్లలు స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నారు. అయితే చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించలేదు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊహించని ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.