వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు

సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు

By -  Knakam Karthik
Published on : 2 Dec 2025 3:33 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, power sector, Ysrcp

వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు

అమరావతి: సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ట్రాన్స్ మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖను ఆదేశింశారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో తమ కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ పొదుపు ఉపకరణాలు వినియోగించేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థపై గత ప్రభుత్వ విధానాలపై సమీక్షలో ప్రస్తావించారు. అసమర్ధ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని, పీపీఏల రద్దు నిర్ణయంతో రూ.9 వేల కోట్ల భారాన్ని వైసీపీ సర్కారు ప్రజలపై మోపిందన్నారు. విద్యుత్ వినియోగించకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణ ద్వారా టారిఫ్ పెంచకుండానే ప్రజలకు ఎలాంటి భారం లేకుండా కూటమి సర్కారు చేసింది..అని సీఎం వ్యాఖ్యానించారు.

Next Story