గుడ్‌న్యూస్‌.. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం

దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.

By Medi Samrat
Published on : 6 May 2025 5:28 PM IST

గుడ్‌న్యూస్‌.. దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం

దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్-1 ఈవో 6, గ్రేడ్-3 ఈవో 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఆలయాలు సమర్ధవంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. అలాగే 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

ప్రతి భక్తుడికు అన్నప్రసాదం :

రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలు ఉండగా... వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి... మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘అన్నప్రసాదం’ రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలి. ఇందుకోసం వాలంటరీగా వచ్చేవారి సేవలను వినియోగించుకోవాలి. అన్నప్రసాద కార్యక్రమానికి ఆదాయం సరిపోని దేవాలయాలకు 7 ప్రధాన ఆలయాల నుంచి నిధులు సమకూర్చేలా చూడాలి. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలి. దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో అన్నప్రసాద వితరణ జరగాలి. అలాగే ప్రసాదాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యతా పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.’ అని సీఎం అన్నారు.

దశలవారీగా ప్రముఖ ఆలయాల అభివృద్ధి:

రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి, మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్‌ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్ టూరిజానికి ఇవి గ్రోత్ ఇంజిన్లు అయ్యేలా చూడాలని చెప్పారు. ‘దేవాలయ భూములు ఆక్రమణకు గురవ్వకుండా, ఆస్తులను పరిరక్షించేలా.. వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలి. ఈ క్రమంలో ఎక్కడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. దేవాదాయ భూములు హోటళ్లకు లీజుకు ఇచ్చినప్పుడు అక్కడ శాఖాహారం మాత్రమే అందించేలా అనుమతి ఇవ్వాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అన్ని నోటిఫైడ్ ఆలయాల్లో సీసీ కెమెరాలు :

‘బాలాజీ ఆలయ నిర్మాణ నిధి’ ఏర్పాటు చేసి... రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున కొత్త ఆలయం నిర్మాణం చేపట్టాలి. ఆలయాలు నిర్మించి, నిర్వహణ విస్మరించొద్దు... ఆలయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం దూపదీప నైవేద్యాలు అందేలా చూడాలి. దేవాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 50 వేలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాల్లో మాత్రమే సీసీ కెమేరాలు ఉండగా... 6సీ కేటగిరీ కింద నోటిఫైడ్ అయిన 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

శ్రీశైల క్షేత్రం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :

రాష్ట్రంలో ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కొలువైన ఒకే ఒక్క క్షేత్రం శ్రీశైలమని... తిరుమల తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ భూములు పరిమితంగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భూకేటాయింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని స్పష్టం చేశారు. శ్రీశైలంలో వసతి గృహాలు ప్రభుత్వమే నిర్మించేలా చూడాలని చెప్పారు.

పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యత :

అన్ని ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. 6 ఏ కేటగిరి ఆలయాల్లో ఇప్పటికే 19 వేల మొక్కలు నాటాము. అటవీ శాఖతో సమన్వయం చేసుకుని మిగిలిన ఆలయాల్లో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడతాం. ఆలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా సెంట్రలైజ్డ్ శానిటేషన్ టెండర్లు పిలిచాం. 175 ఆలయాల్లో ఆన్‌లైన్ దర్శనం, సేవ, వసతి, ఈ హుండీ వంటివి తీసుకువచ్చాం. రూ.7 కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ వచ్చే 22 ఆలయాల్లో వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రవేశపెట్టాం. కృష్ణా, గోదావరి హారతులు ప్రతినిత్యం కొనసాగిస్తాం.’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఏడాదికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం :

రాష్ట్రంలో మొత్తం నోటిఫైడ్ ఆలయాలకు ఏడాదికి రూ.1,300 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. అందులో రూ.850 కోట్లు టాప్ 7 ఆలయాల నుంచి సమకూరుతోంది. రూ.5 లక్షలు కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 9 శాతం మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద జమచేస్తున్నారు. 2024-25లో సీజీఎఫ్‌కు రూ.149 కోట్లు రాగా... రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో రూ.111 కోట్లతో 48 పనులు జరుగుతున్నాయి. మొత్తం నోటిఫైడ్ ఆలయాలు 25,028 కాగా, వీటిలో ప్రస్తుతం రూ.50 లక్షల పైన ఆదాయం వచ్చే 6ఏ కేటగిరి ఆలయాలు-169, రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఆదాయం ఆర్జిస్తున్న 6బీ కేటగిరీ ఆలయాలు-321, రూ.15 లక్షలు కన్నా తక్కువ ఆదాయం వచ్చే 6సీ కేటగిరీ ఆలయాలు-24,538 ఉన్నాయి.

Next Story