కరెంట్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నిత్య విద్యార్థిగా ఉంటూ.. అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి వివరించారు. నియోజకవర్గాల వారీ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఒక యంగ్ ప్రొఫెషనల్ ను నియమిచింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల వారీ విజన్ డాక్యుమెంట్లకు అనుగుణంగా పనిచేసేందుకు నియమితులైన ఈ యంగ్ ప్రొఫెషనల్స్ కు ప్రణాళిక శాఖ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. మంగళవారం సచివాలంయలోని ఐదో బ్లాకులో శిక్షణ ముగించుకున్న యంగ్ ప్రొఫెషనల్స్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యంగ్ ప్రొఫెషనల్స్ కు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..”నియోజకవర్గానికో యంగ్ ప్రొఫెషనల్ నియమించడం కొత్త విధానం. నేను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యతాంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకున్నాను. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సహా మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి కచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా పనిచేస్తే... సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి.. సరైన విధానాలు అవలంభించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు యంగ్ ప్రొఫెషనల్స్ వివరించాలి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వస్తాయనే అంశంపైనా ముందుగా అంచనాలు వేయగలగాలి. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది.. అయినా ముందు చూపుతో నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాం. రికార్డు సమయంలో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేసి.. నీటిని విడుదల చేశాం. ఫలితంగా రాయలసీమ సహా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకున్న కెపాసిటీలో 80 శాతం మేర నీటిని నిల్వ చేసుకోగలిగాం. దీని వల్ల భూగర్భ జలాలు పెరిగాయి.” అని సీఎం చెప్పారు.
నియోజకవర్గ బలాలను గుర్తించండి
“ప్రతి నియోజకవర్గానికీ ఓ బలం ఉంటుంది. అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయి. అలాంటి వాటిని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించి.. అధ్యయనం చేయాలి. ఆ వనరుల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ మేం చేపడుతున్నాం. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం.. పాత్ హోల్స్ నిమిత్తమే రూ.1000 కోట్లు ఖర్చు పెట్టాం. జాతీయ రహదారులను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాం.. ఏపీలో రోడ్లు అమెరికా స్థాయిలో ఉంటాయని నితిన్ గడ్కరీ చూడా చెప్పారు. విద్యుత్ రంగంలో గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. టెక్నాలజీని అన్ని రంగాల్లో వినియోగించుకుంటున్నాం. రాష్ట్ర సమగ్ర, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. ఇలా జరుగుతున్న అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను యంగ్ ప్రొఫెషనల్స్ నిరంతరం చూసుకుంటూ ఉండాలి. యంగ్ ప్రొఫెషనల్సుకు ఇదో అద్భుతమైన అవకాశం.. మంచి అనుభవం కూడా వస్తుంది. ఇన్నాళ్లు సీఎంగా పని చేసిన నాకు ఎంత అనుభవం వచ్చిందో... మీకూ అంతే అనుభవం వస్తుంది. యంగ్ ప్రొఫెషనల్స్ గా విధులు చేరాక.. ఇబ్బందులూ ఎదురవుతాయి.. ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. సరైన సమాచారం మీ దగ్గర లేకుంటే.. మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోరు. అందుకే ప్రతి అంశాన్ని అధ్యయనం చేయండి.. అప్డేట్ అవ్వండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు... అభివృద్ధి కోసం మీరు చేసే ఆలోచనలను అమలు చేయడానికి ఆకాశమే హద్దు అని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించాలి.” అని ముఖ్యమంత్రి అన్నారు.
మనసు పెట్టి పని చేయండి... విజయం మీతోనే ఉంటుంది
“ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాలి. వినూత్నంగా ఆలోచనలు చేయాలి. ఏదో ఉద్యోగం మాదిరిగా విధులు నిర్వహించవద్దు. మనసు పెట్టి పనిచేస్తే మీకూ ఉపయోగం... నియోజకవర్గానికి ఉపయోగం. 1995లో సంస్కరణలు వచ్చినప్పుడు నేర్చుకుని.. తెలుసుకుని.. అధ్యయనం చేసి.. మనకు అన్వయించుకున్నాం కాబట్టే అభివృద్ధి సాధించగలిగాం. ప్రపంచంలో తెలుగు వారికి ప్రత్యేక స్థానం ఉండేలా చేయగలిగాం. అప్పట్లో సంస్కరణల గురించి మాట్లాడితేనే.. పేదలకు వ్యతిరేకమనే భావన ఉండేది. కానీ సంపద సృష్టిస్తే సంక్షేమం చేసి పేదలకు పంచవచ్చని నమ్మి సంస్కరణలు అమలు చేశాం. విజన్ అంటే ఏమిటో ఇప్పుడు కొందరికి అర్థమవుతోంది.. నేను విజన్ 2020 పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు. నేను రూపొందించిన విజన్ 2020 హైదరాబాద్ విషయంలో 100 శాతం నిజమైంది. సంపద సృష్టి చేయడమే కాకుండా.. పేదలకు ఎంత వరకు లబ్ది చేకూర్చగలిగామనేది కూడా విజన్ డాక్యుమెంటులో భాగమే. ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత కొత్తగా ఉందని.. ఒత్తిడిగా ఉందని యంగ్ ప్రొఫెషనల్స్ భావించకూడదు. కష్టంతో కాకుండా.. ఇష్టంతో పని చేయండి. నియోజకవర్గంలో 9 మంది సభ్యులతో కలిసి యంగ్ ప్రొఫెషనల్స్ పని చేయాలి.. అందర్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. క్షేత్రస్థాయికి వెళ్లిన యంగ్ ప్రొఫెషనల్స్ ప్రభుత్వానికి.. నాకూ బలంగా ఉండాలి. మీ సత్తా ఏంటో నిరూపించాలి. సీఎం మంచి వాళ్లను తమ నియోజకవర్గానికి పంపించారని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. మీరు మంచి పేరు తెచ్చుకోండి.. నాకూ మంచి పేరు తీసుకురండి. ఇవాళే ఓ డెవలప్మెంట్ జరిగింది. ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ ను కేంద్రం కేటాయించింది. ఇది మంచి పరిణామం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టం ఏర్పడడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం దొహదపడుంది.” అని సీఎం చంద్రబాబు చెప్పారు. శిక్షణ ముగించుకున్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ కు ప్రణాళిక శాఖ నియామక పత్రాలు అందచేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, పీ4 ఫౌండేషన్ వైఎస్ ఛైర్మన్ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.