ఏపీకి పలువురు బీజేపీ నేతలు క్యూ కట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మే 7, 8 తేదీల్లో ఆంధప్రదేశ్‌లో మోదీ పర్యటిస్తారు. ఈ నెల 7న సాయంత్రం 3.30 గంటలకు తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభకు కూడా హాజరవుతారు. మే 8న సాయంత్రం 4 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని రోడ్‌షో ఉండనుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు గడ్కరీ విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి అరకు లోక్ సభ స్థానం పరిధిలోని వెంకంపేట వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6.15 గంటలకు గడ్కరీ నాగ్ పూర్ వెళ్లనున్నారు.