చంద్రబాబు నివాసంలో తేనీటి విందు.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా సూపర్ స్టార్

Chandrababu Tea Party to Super Star Rajinikanth. సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

By Medi Samrat
Published on : 28 April 2023 6:30 PM IST

చంద్రబాబు నివాసంలో తేనీటి విందు.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో తేనీటి విందును ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు రజనీకాంత్ వచ్చారు. ఆయనను చంద్రబాబు తన నివాసానికి ఆహ్వానించారు. రజనీకాంత్ రాకకు ముందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు నివాసానికి వచ్చారు. టీడీపీ అధినేత ఇంట తేనీటి విందులో రజనీకాంత్, నటుడు బాలకృష్ణ, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రజనీకాంత్ రాష్ట్రానికి వచ్చారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సూపర్ స్టార్ కు బాలకృష్ణ స్వాగతం పలికారు. విజయవాడకు చేరుకున్న రజనీకాంత్ కాసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాలకృష్ణ రజనీకాంత్ ను చంద్రబాబు నివాసానికి స్వయంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరూ పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణతో కలిసి తాజా పరిస్ధితులపై మాట్లాడుకున్నారు.


Next Story