సినీ పరిశ్రమ టీడీపీకి సహకరించలేదు : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu Sensational Comments On Tollywood. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.
By Medi Samrat Published on 11 Jan 2022 7:56 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఓ వైపు కమిటీ వేసి మరీ చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సినిమా టికెట్ల అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చాయని ఆరోపించారు. వైసీపీ నేతలు తమను సినిమా టికెట్ల వివాదంలోకి లాగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే 2009లో అధికారంలోకి వచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు. చిరంజీవి వల్లే తాము ఓడిపోయామని చంద్రబాబు కామెంట్స్ చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కారణంగా తమకు విజయం దూరమైందని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకపోతే తామే గెలిచేవాళ్లమని అన్నారు. చిరంజీవితో అప్పుడు, ఇప్పుడు తనకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి.. భవన నిర్మాణంపై మాట్లాడరని విమర్శించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. నిన్న-మొన్న కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ మంగళవారం ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో ప్రత్యక్షంగా భేటీ అయ్యింది . హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని న్యాయశాఖ కార్యదర్శి , ఐ ఆండ్ పీఆర్ కమిషనర్‌తో పాటు అధికారులు, సినీరంగ ప్రతినిధులు 13 మంది సమావేశంలో పాల్గొన్నారు. ఇదివరకే వర్చువల్ విధానం ద్వారా సమావేశమై సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న కమిటీ ఈసారి నేరుగా సమావేశమై చర్చలు నిర్వహించింది. టికెట్ ధరలపై జేసీలు ఇచ్చిన సిఫార్సులపై కమిటీ చర్చించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.