మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 2 March 2025 6:42 PM IST
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి, వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో టైలరింగ్ లో శిక్షణ అందజేసి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమాజాభివృద్ధిలో మహిళలే కీలకమని గుర్తించిన టీడీపీ ప్రభుత్వాలు...వారి సాధికారితకు, ఆత్మగౌరవానికి, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. నాడు అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు రాజ్యాధికారంలోనూ భాగస్వాములను చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కూడా అన్నింటా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు కూడా వారి పేరు మీదనే చేపడుతున్నారు. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదే. మహిళల అభ్యున్నతికి వెన్నంటి ఉంటూ భరోసా కల్పిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వారికి ఆర్థికాభ్యున్నతి కల్పించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా స్వయం ఉపాధి పథకాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి పట్టున ఉండే మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి కుట్టుమిషన్లను కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభంకానున్నాయి.
1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లోనూ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,02,832 మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.255 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్లూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా అదే సామాజిక వర్గానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.
90 రోజుల పాటు శిక్షణ.. ఉచితంగా కుట్టు మిషన్లు
మహిళలకు భవిష్యత్తుపై భరోసా లభించేలా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 90 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. తూతూ మంత్రంగా కాకుండా టైలరింగ్ లో నిష్ణాతులైన వారితో మహిళలకు శిక్షణివ్వనున్నారు. నేటి అభిరుచులకు అనుగుణంగా దుస్తుల తయారీలో ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నారు. శిక్షణ ద్వారా ప్రావీణ్యం పొందిన మహిళలు సొంతంగా ఆదాయ ఆర్జిస్తూ, తమ కుటుంబాలకు తద్వారా సమాజానికి ఆసరాగా నిలవ్వాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయం.
మహిళల ఆర్థిక స్వేచ్ఛకు మరెన్నో పథకాలు
సంపద సృష్టిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు చంద్రన్న ప్రభుత్వం వారిని వివిధ వృత్తులను ప్రోత్సహిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణతోనే సరిపెట్టకుండా ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాటులోనూ మహిళలకే ప్రాధాన్యమిస్తున్నారు. వాటితో పాటు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే స్వయం ఉపాధి పథకాల అమలులోనూ మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. డెయిరీ, గొర్రెల వంటి యూనిట్లతో పాటు జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటులోనూ ముందుకొచ్చిన మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం: మంత్రి సవిత
సమాజాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చిల్లర దుకాణాలు, కుట్టు శిక్షణ, అగరబత్తీలు, పామాయిల్ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆట బొమ్మల తయారీలో భాగస్వాములను చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,02,832 మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేసి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీఎం చంద్రబాబు నాయుడు లక్షసాధనలో భాగంగా తమవంతు సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని మంత్రి సవిత కోరారు.