గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు.

By Medi Samrat  Published on  12 July 2024 10:41 AM GMT
గ‌త‌ ప్రభుత్వం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు : సీఎం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని అధికారులు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని సిఎంకు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిథిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యంవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు.

సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చ

రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో, మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైనా నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.

Next Story