అలా చేసి ఉంటే ఈ హత్యే జరిగేది కాదు : డీజీపీకి చంద్రబాబు లేఖ
Chandrababu Responds On TDP Worker Murder. మాచర్లలో జల్లయ్య హత్య, పోలీసులు వైఖరిపై టిడిపి అధినేత నారా చంద్రబాబు
By Medi Samrat Published on 4 Jun 2022 12:22 PM GMTమాచర్లలో జల్లయ్య హత్య, పోలీసులు వైఖరిపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిజిపికి లేఖ రాశారు. కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారు. కుటుంబ సభ్యులను సైతం పోలసులు బలవంతంగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్లారు. పార్టీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను, టిడిపి బృందాన్ని పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారని లేఖలో ప్రస్తావించారు.
జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టిడిపి నేతలకు, అతని బంధువులను అనుమతించాలని డీజీపీని కోరారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్యే జరిగేది కాదని రాసుకొచ్చారు. 2019 తరువాత ఒక్క మాచర్లలోనే ఐదుగురు బిసి వర్గం వారిని హత్య చేశారని.. అందులో 4గురు యాదవ సామాజికవర్గం వారే ఉన్నారని లేఖలో వివరించారు.
పోలీసుల మద్దతుతో వైసీపీ వరుస హత్యలతో టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మాచర్లలో బీసీ వర్గంపై జరుగుతున్న హత్యాకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలని లేఖలో కోరారు.
పల్నాడు జిల్లా జంగమహేశ్వరపాడులో ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త జల్లయ్య మరణించారు. జల్లయ్య కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా నిలబడింది. జల్లయ్య కుటుంబానికి టీడీపీ తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. జల్లయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.