ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : పార్టీలకు చంద్రబాబు పిలుపు

Chandrababu Press Meet In Vijayawada. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  18 Oct 2022 6:24 PM IST
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : పార్టీలకు చంద్రబాబు పిలుపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. విశాఖలో జరిగిన ఘటనలపై పవన్ కల్యాణ్‌కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు వచ్చారని జనసేన పార్టీ పేర్కొంది. ఇరువురు భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప‌వన్ క‌ళ్యాణ్‌పై ప్రభుత్వ అనుస‌రించిన విధానం సరికాదన్నారు. పవన్‌కు సానుభూతి తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం సరికాదని సూచించారు. పవన్‌ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు.

ఒకేరోజు ఎప్పుడు రెండు పార్టీల సమావేశాలు ఉంటే.. ఆయా నేతలు ఎదురుకాకుండా పోలీసులు చూసుకుంటారని.. కానీ విశాఖలో పోలీసుల తీరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. పవన్‌ను నడిరోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. కొందరు పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కార్యక్రమాలపై అడుగడుగునా ఆంక్షలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని.. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ నేతలకే రక్షణ లేక‌పోతే.. ఇక ప్రజలకేం రక్షణ కల్పిస్తారని ప్ర‌శ్నించారు. అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు. ప్రజా సమస్యలపై ప్ర‌భుత్వాన్ని నిలదీస్తాం.. అవసరమైతే మెడలు వంచుతామన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చర్చించాలన్నారు.





Next Story