ఇలాంటి వేషాలు వేస్తే తోకలు కత్తిరిస్తా : చంద్రబాబు వార్నింగ్
Chandrababu Fire On YSRCP. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు పర్యటనలకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. కర్నూలు పర్యటనలో భాగంగా శుక్రవారం చంద్రబాబు టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అదే సమయానికి టీడీపీ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. న్యాయ రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేయాలని.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించడాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తల నిరసనలకు పోటీగా టీడీపీ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరుపార్టీల నేతలు కార్యకర్తలను శాంతింపజేశారు. వైసీపీ కార్యకర్తల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీల పాలన సాగుతోందని.. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారా అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల రౌడీయిజాన్ని అడ్డుకుంటామని.. ఇలాంటి వేషాలు వేస్తే తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ సైకోలా మారి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. జగన్ పాలనలో అన్ని వర్గాల వారికీ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదన్నారు.