అతి భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది నేడు తీవ్ర వాయుగుండంగా మారి.. రేపు తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది.
By అంజి Published on 2 Dec 2023 3:56 AM GMTఅతి భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది నేడు తీవ్ర వాయుగుండంగా మారి.. రేపు తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 4వ తేదీన కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకుని, 5వ తేదీన నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపింది. దీంతో ఆది, సోమ, మంగళవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది.
అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 112, 18004250101 హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారం తేదీల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.