తెలుగు రాష్ట్రాల హైకోర్టు జడ్జిల బదిలీ
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు.
By Medi Samrat Published on 18 Oct 2023 7:38 PM ISTతెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తం మీద 16 మంది హైకోర్టు జడ్జీలను ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మున్నూలు లక్ష్మణ్‌ను రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అనుమపా చక్రవర్తిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అవుతున్న ఇద్దరి స్థానంలో కొత్తవారి నియామకంపై ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాధ్ రాయ్ గుజరాత్ హైకోర్టుకు, అదనపు జడ్జి డి.వెంకటరమణ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కర్ణాటక హైకోర్టు జడ్జి జి.నరేంద్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పని చేస్తున్న పదహారు మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ బదిలీలను సుప్రీంకోర్టు కొలీజియం గత ఆగస్టులోనే కేంద్రానికి సిఫారసు చేసింది. వాటిని ఇప్పుడు ఆమోదించింది.