అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ
Central Home Secretary Letter To All State Chief Secretaries. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ
By Medi Samrat Published on 19 Jun 2021 8:41 AM GMT
అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని సూచించారు. ఆంక్షలు మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలని అన్నారు. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని సూచించారు.
పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలని ఆదేశించారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైన ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమని.. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచించారు.ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.