ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసివేయడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ విషయంలో కేంద్రం కుట్ర చేసిందని, అందులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కూడా భాగం ఉందని బొత్స ఆరోపించారు. ఉపాధి హామీపై కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించరా అని బొత్స వ్యాఖ్యలు చేశారు. పేదలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం తప్పు చేస్తోందని, దీంతో పేద, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు రాష్ట్రాలలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇది ప్రజాస్వామ్య విలువలు, దేశ ప్రజల శ్రమపై దాడి అని అభివర్ణించింది. బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు కేటాయింపులను నిరంతరం తగ్గించిందని, ఈ పథకాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మహాత్మా గాంధీ పేరు ప్రజల మనసులో లోతుగా పాతుకుపోయిందని కాంగ్రెస్ నేతలు అన్నారు.