Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM ISTAndhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు పీఎంవో తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్టు పేర్కొంది. గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
అటు అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనలో సహాయక చర్యలు అర్థరాత్రి పూర్తయ్యాయి. సిబ్బంది శిథిలాలను పూర్తిగా తొలగించారు. భారీ అగ్ని మాపక యంత్రాల సాయంతో 33 మందిని రక్షించారు. ఇప్పటికే 18 మంది కన్నుమూశారు. ఆస్పత్రుల్లో పలువురు కార్మికులు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే మృతుల సంఖ్య పెరగొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ఎసెన్షియా ఫార్మా కంపెనీలో నిన్న మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో బీ షిప్ట్‌కు వచ్చినవారు, ఏ షిప్ట్ నుంచి వెళ్లిపోయేవారితో రద్దీగా ఉంది. అదే సమయంలో కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. అచ్యుతాపురం పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. 18 మంది మృతి తనను కలచివేసిందన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.