ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపుతాం

BJP to be in fray in Atmakur bypoll. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని

By Medi Samrat  Published on  23 April 2022 1:28 PM IST
ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపుతాం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో అవినీతి, బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరిగిపోయాయని అన్నారు. ఫిబ్రవరి 21న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక జరగనుంది. రాజకీయ కారణాలతో అమాయక ప్రజలను వేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఇటీవల కోర్టు ఆవరణలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కేసుకు సంబంధించిన పత్రాల చోరీపై నెల్లూరు ఎస్పీ చేసిన ప్రకటనను ఆయన దుయ్యబట్టారు.

ఎస్పీ చెప్పిన సంఘటనల క్రమం తమాషాగా ఉందని ఎద్దేవా చేశారు. పోలీసు శాఖపై గౌరవం పెంచే విధంగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాలని సూచిస్తున్నాం'' అని అన్నారు. రాజకీయ నాయకులు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని, ప్రభుత్వోద్యోగులు 40 ఏళ్లు సేవలందించి అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కె.ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జి.భరత్‌కుమార్‌, మహిళా విభాగం నాయకురాలు కె.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story