వైసీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. హర్యానా నుంచి రేఖాశర్మను, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది.
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్ కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేశారు. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.