ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. దారుణమైన పాలనతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని, తద్వారా నిరుద్యోగం ఏర్పడుతుందని ఆమె అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా శక్తి కేంద్రం ప్రముఖుల సమావేశం జరిగింది.
సమావేశానికి హాజరైన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పురంధేశ్వరి మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించడం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఏపీలో బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని, రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉంటుందని పురంధేశ్వరి హామీ ఇచ్చారు.
కాగా, జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందని, రెండు పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధేశ్వరి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం పొత్తులపై తమముందు మూడు ప్రత్యామ్నయాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల పొత్తుల విషయంలో బీజేపీ మౌనం పాటిస్తోంది.