తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నర్సీపట్నానికి చెందిన బి.నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందినట్టు గుర్తించారు. మరో 40 మంది తీవ్రంగ గాయపడ్డారు. క్షతగాత్రులను రుయూ ఆస్పత్రికి తరలించారు. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్‌లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు.
అయితే టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూలై్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. నిన్న సాయంత్రం నుంచి భక్తులు టోకెట్ల కోసం 9 ప్రాంతాల్లోని 95 కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877 - 2236007 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించనున్నారు.