వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. కీలక బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి బాలినేని తప్పకున్నట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్‌గా ఉన్నారు. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు.