బద్వేలు ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీచేస్తారని ఏపీ​ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్‌ ఇవ్వడం మా సంప్రదాయమ‌ని తెలిపారు. సానుభూతిగా మిగిలిన పార్టీల‌వారు పోటీలో ఉండకపోవడం సాంప్రదాయమ‌ని.. ఒకవేళ పోటీలో ఉంచినా ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అంతే తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.

ఇక‌ ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి అభిమానం పెరుగుతోందని.. ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయని అన్నారు. నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామ‌ని.. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల పేర్కొన్నారు. ఇదిలావుంటే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స‌జ్జ‌ల స్పందించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందని అన్నారు. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారని విమ‌ర్శించారు.

పవన్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారని.. పవన్ క‌ళ్యాణ్‌ లాంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లే భావిస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని.. ఈ విధానంతో పారదర్శకత సాధ్యమ‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసున‌ని.. సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేన‌ని సజ్జల అన్నారు. పవన్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు.


సామ్రాట్

Next Story