తాలిబన్ల రాజ్యం స్థాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి తేడా ఏంటి?

Atchannaidu Fires On YSRCP. రాష్ట్రంలో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించటం బాధాకర‌మ‌ని

By Medi Samrat  Published on  21 Sep 2021 10:06 AM GMT
తాలిబన్ల రాజ్యం స్థాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి తేడా ఏంటి?

రాష్ట్రంలో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించటం బాధాకర‌మ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష‌డు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ప్రమాణస్వీకారంతో మొదలైన వైసీపీ అరాచకాలు.. వినాయకుని నిమజ్జనం వరకు కొనసాగుతూనే ఉన్నాయని.. ఏంటి ఈ అరాచకం తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి తేడా ఏంటి? ప్ర‌శ్నించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేన‌ని, ఇప్పుడు తప్పు చేసిన వారిని రేపు చంద్రమండలంలో దాక్కున్నా సరే వదలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అబద్దాలకు, అరాచకానికి, వంచనకు చిరునామా జగన్ జమానాగా మారిందని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థది ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరమ‌ని.. రాష్ట్రంలో శాంతి భధ్రతలు అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అందుకు సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు.

అకారణంగా అధికారమదంతో మీరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని అన్నారు. గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ‎మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, బైక్ దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని.. వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటి? అని ప్ర‌శ్నించారు. ఘటనా స్ధలంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం పోలీసు వ్యవస్ధ పనితీరుకు అద్దం పడుతోందని మండిప‌డ్డారు.

టీడీపీ కార్యకర్తల ఇళ్ల‌ మీదకు వచ్చి వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నందుకేనా రాష్ట్ర‌ పోలీసులకు అవార్డులు వచ్చిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందని ఎద్దేవా చేశారు. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామ‌ని హెచ్చ‌రించారు.


Next Story